సనాతన ధర్మం సంపూర్ణ జీవితానికి మార్గదర్శకం :
తిరుపతి జెఈవోశ్రీ బి.లక్ష్మీకాంతం
తిరుపతిలో ఘనంగా ముగిసిన ”శుభప్రదం”
సనాతన ధర్మం సంపూర్ణ జీవితానికి మార్గదర్శకం
* తిరుపతి జెఈవో బి.లక్ష్మీకాంతం
* తిరుపతిలో ఘనంగా ముగిసిన ”శుభప్రదం”
తిరుపతి: శుభప్రదం శిక్షణ తరగతుల్లో సనాతన ధర్మం ద్వారా యువత చిరుప్రాయంలోనే మానవీయ, నైతిక విలువలను ఆకలింపు చేసుకుని సంపూర్ణ జీవితాన్ని గడిపేందుకు మార్గదర్శకాలుగా నిలుస్తాయని టిటిడి తిరుపతి జెఈవో బి.లక్ష్మీకాంతం ఉద్ఘాటించారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఆదివారం శుభప్రదం శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి జెఈవో ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ భారతదేశం సనాతన ధర్మ పునాదులపై నిర్మితమైందని, హైందవ సంస్కృతికి వేదాలు మూలమని పేర్కొన్నారు. మారుతున్న జీవన విధానంలో కుటుంబ వ్యవస్థలో కూడా మౌలికమైన మార్పులు వచ్చాయని, ఈ క్రమంలో నేటితరానికి సనాతన ధార్మిక అంశాలు తెలియడం లేదన్నారు. ఈ కార్యక్రమం ద్వారా నేటితరానికి సనాతన ధార్మిక విషయాలను బోధిస్తున్నామని తెలిపారు. హిందూ ధర్మం అనేది మతం కాదని, ఇది జీవన విధానమని, జీవించేటప్పుడు ప్రతి ఒక్కరు ధర్మబద్ధంగా నడుచుకోవాలని తెలియజేస్తుందన్నారు. సనాతన హైందవ ధర్మంలోని మౌలిక విషయాలైన రామాయణం, భారత భాగవతాలలోని నీతి కథలు, నవగ్రహలు, అష్టదిక్పలకులు, అష్టదశ శక్తి పీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, 108 దివ్యాక్షేత్రాలు, ధశావతారాలను టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా అందించిన్నట్లు వివరించారు. టిటిడి సప్తగిరి మాస పత్రికను ప్రస్తుతం 2 లక్షలకు పైగా చందాదారులు ఉన్నట్లు తెలిపారు. దీనిని 10 లక్షలకు పెంచడం ద్వారా సనాతన ధర్మన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి జ్ఞానం, సత్ప్రవర్తన, ధైర్యం అలవరుచుకుంటే జీవితంలో రాణించవచ్చని, తద్వారా యువతలో సామాజిక స్పృహ పెంపొందుతుందన్నారు. శుభప్రదంలో శిక్షణ పొందిన బాల బాలికల సేవలను ధర్మప్రచారంలో ఉపయోగించుకుంటామన్నారు. శుభప్రదం శిక్షణ తరగతుల్లో గురువులు నేర్పిన విషయాలను తల్లిదండ్రులు, మిత్రులు, బంధువులతో పంచుకోవాలని, ఎలా ఆచరించాలో ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. కాగా, రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 3,023 మంది విద్యార్థినీ విద్యార్థులకు మే 27 నుండి జూన్ 2వ తేదీ వరకు తిరుపతిలోని 6 కేంద్రాలలో వారం రోజుల పాటు శుభప్రదం శిక్షణ తరగతులు నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో 7, 8, 9వ తరగతుల విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా ఏర్పాటుచేసిన కేంద్రాల్లో ఉచితంగా నాణ్యమైన భోజనం, బస కల్పించామన్నారు.
అంతకుముందు తిరుపతి ఇస్కాన్ ప్రతినిధి శ్రీ లీలాపారాయణదాస్ మాట్లాడుతూ భావి భారత పౌరులైన విద్యార్థులు భారతీయ హైందవ సనాతన ధర్మం, సంస్కృతి, సంప్రదాయ విలువలను నేర్చుకుని ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని అన్నారు. ఉత్తమ పౌరులను సమాజానికి అందించడం ద్వారా దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. అనంతరం శుభప్రదం కార్యక్రమంలో శిక్షణ పొందిన విద్యార్థినీ, విద్యార్థులకు సర్టిఫికేట్లను అధికారులు ప్రదానం చేశారు. అంతకుముందు అర్చకులు స్వామి, అమ్మవార్ల చిత్రపట్టాలకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శుభప్రదం శిక్షణ తరగతులకు విచ్చేసిన బాలబాలికలు నిర్వహించిన సాంస్కృతిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి పద్మావతి మహిళా డిగ్రీ, పిజి కళాశాల తెలుగు విభాగాధిపతి కృష్ణవేణి వ్యాఖ్యాతగా వ్యవహరించగా, టిటిడి హిందూధర్మప్రచార పరిషత్ కార్యదర్శి డాక్టర్ రమణప్రసాద్, ఎపిక్ స్టడిస్ ప్రత్యేకాధికారి దామోదర్‌నాయుడు, ఇతర అధికారులు, అధ్యాపకులు, విద్యార్ధులు పాల్గొన్నారు.