24-March-2019-NewsClips

ఆదివారం, మార్చి 24, 2019
పనులు పూర్తి చేస్తారా.. రద్దు చేయమంటారా..?
కల్యాణ వేదిక శాశ్వత నిర్మాణ పనులను పరిశీలిస్తున్న
ఈవో అనిల్‌కుమార సింఘాల్, జేఈవో లక్ష్మీకాంతం
ఒంటిమిట్ట, న్యూస్‌టుడే : ఏమయ్యా.. మీకు మూన్నెల్లుగా చెబుతున్నాం. కోదండరామాలయం బ్రహ్మోత్సవాల నాటికి పనులను పూర్తవ్వాలని లక్ష్యాన్ని నిర్దేశించాం. ఈ ఏడాది ఆరంభం నుంచి నాలుగుసార్లు వచ్చా. ఎప్పుడొచ్చినా చేస్తాం.. చూస్తాం అంటున్నారు. ఇప్పటిలాగే చేస్తామంటే కుదరదు. వచ్చే నెల 16వ తేదీ నాటికి పూర్తి చేస్తారా.. లేదంటే గుత్త ఒప్పందాన్ని రద్దు చేయమంటారా.. అంటూ తిరుమల తిరుపతి దేవస్థానాల కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్ సింఘాల్ గుత్తేదారులను హెచ్చరించారు. బాధ్యతలేకుండా చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఒంటిమిట్టలో తితిదే ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఈవోతో పాటు జేఈవో బి.లక్ష్మీకాంతం, ముఖ్య భద్రతాధికారి గోపినాథ్‌జెట్టి, ముఖ్య సాంకేతిక నిపుణులు సి.చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి శనివారం పరిశీలించారు. తొలుత సీతారాముల కల్యాణ వేదిక ప్రాంగణంలో జరుగుతున్న శాశ్వత నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల నాటికి పనులు పూర్తి చేయాలని చెప్పినా మీలో కదలిక లేదు. వచ్చే నెల 18న సీతారాముల కల్యాణం జరుగుతోంది. ఏప్రిల్ 16 నాటికి కల్యాణ వేదిక ప్రాంగణంలో చేపట్టిన పనులన్నీ వంద శాతం పూర్తవ్వాల్సిందే. చేయలేకపోతే చెప్పండి.. గుత్త ఒప్పందాన్ని రద్దుచేస్తానన్నారు. ఇలాగే నిర్లక్ష్యంగా చేయిస్తే ఉద్యోగం ఊడిపోతుందంటూ ఇంజినీరింగ్ అధికారులను హెచ్చరించారు. భక్తుల విశ్రాంతి, పరిపాలన కార్యాలయాల భవనాల పనులు, ఉద్యాన వనాలను చూశారు. శాశ్వత వాహన మండపాన్ని ఎప్పటిలోగా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. పుష్కరిణిలో నీటి నిల్వ ఎలా ఉందని పరిశీలించారు. రామాలయం తూర్పు గోపురం నుంచి పుష్కరిణి కన్పించేలా ఇతర కట్టడాలను తొలగించాలని ఆదేశించారు. బ్రహ్మోత్సవాల నిర్వహణపై వచ్చే వారంలో ఏకశిలానగరిలో తితిదే, జిల్లా అధికారులతో సమన్వయ సమీక్షను నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారిణి గౌతమి, ఎస్ఈ రమేష్‌రెడ్డి, రాజంపేట ఆర్డీవో నాగన్న, ఈఈ జగన్మోహన్రెడ్డి, జిల్లా పర్యటక శాఖ అధికారి రాజశేఖర్‌రెడ్డి, డీఈ హర్షవర్దన్‌రెడ్డి, ఉప, సహాయ కార్యనిర్వహణాధికారులు నటేష్‌బాబు, రామరాజు పాల్గొన్నారు.