29-June-2019 Press Notes
పత్రికా ప్రకటన :: జూన్ 29, తిరుపతి, 2019
ఎస్వీ ఆయుర్వేద, బర్డ్ ఆసుపత్రులకు ఐఎస్వో ధ్రువీకరణ
టిటిడి ఈవో, జెఈవో సమక్షంలో ధ్రువపత్రం అందించిన ఐఎస్వో ప్రతినిధులు


టిటిడికి చెందిన తిరుపతిలోని ఎస్వీ ఆయుర్వేద, బర్డ్ ఆసుపత్రులకు ఐఎస్వో (ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్) ధ్రువీకరణ లభించింది. ఈ మేరకు ఐఎస్వో సంస్థ ప్రతినిధులు శనివారం ఆయా ఆసుపత్రుల్లో ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం సమక్షంలో ధ్రువపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ ఎస్వీ ఆయుర్వేద, బర్డ్ ఆసుపత్రులలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, సిబ్బంది దుస్తుల కోడ్, గుర్తింపు కార్డు, సూచిక బోర్డులు, రోగులకు నాణ్యమైన ఆహారపదార్థాలు, నీరు తదితర సౌకర్యాలు కల్పించిందన్నారు. రోగులు ఆసుపత్రికి వచ్చినప్పుడు వారికి అవసరమైన సమాచారాన్ని సిబ్బంది సేవాభావంతో అందిస్తున్నారన్నారు. ప్రపంచంలోని 244 దేశాలలో ఎక్కడాలేని విధంగా గత 3 నెలల కాలంలో 12 టిటిడి సంస్థలకు ఐఎస్వో గుర్తింపు లభించినట్లు తెలిపారు.
ఇందులో భాగంగా తిరుపతిలోని విష్ణునివాసం, మాధవం వసతి సముదాయాలు, ఎస్పిడబ్యు పాలిటెక్నిక్, శ్రీ పద్మావతి జూనియర్ కళాశాల, ఎస్వీ జూనియర్ కళాశాలలకు లభించిందన్నారు. అదేవిధంగా కుప్పం, రాజాం, నర్సాపూర్, మహబూబ్‌నగర్, బెంగుళూరులోని కల్యాణ మండపాలకు ఐఎస్వో గుర్తింపు లభించిందన్నారు. నేడు ఐఎస్వో ప్రతినిధుల బృందం సహాకారంతో ఎస్వీ ఆయుర్వేద, బర్డ్ ఆసుపత్రులకు ఐఎస్వో గుర్తింపు లభించినట్లు వివరించారు. టిటిడి సంస్థలకు తక్కువ సమయంలో ఐఎస్వో గుర్తింపు రావడానికి కృషి చేసిన సివిల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఆధికారులు, ఎఫ్ఎమ్ఎస్, పారామెడికల్ సిబ్బంది, ఎస్వీబీసీకి అభినందనలు తెలిపారు.
అంతకుముందు ఈవో, జెఈవో, ఐఎస్వో డైరెక్టర్ శ్రీ కార్తికేయన్ కలిసి ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రిలోని రిసెప్షన్, ఓపి నమోదు, కాయ చికిత్స, పంచకర్మ, ఎక్సరే, శలక్య, శల్యతంత్ర, చిన్నపిల్లల విభాగాలను పరిశీలించారు. అనంతపురం, ప్రొద్దుటూరు, కృష్ణా జిల్లా, గుంటూరు, హైదరాబాద్, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాల నుండి చికిత్స కోసం వచ్చిన రోగులతో ఈవో, జెఈవో ముచ్చటించారు. వైద్యసేవలు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం బర్డ్ ఆసుపత్రిలో ఓపి, ఎక్సరే, స్టోర్ గది, ఆపరేషన్ థియేటర్లు, ఫిజియోథెరపి తదితర విభాగాలను పరిశీలించారు. ఎస్వీ ఆయుర్వేద, బర్డ్ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యసేవలందిస్తున్నారని అక్కడి డాక్టర్లు, సిబ్బందిని ఈవో అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఎస్వీ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డా.. శంకరబాబు, ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా..పార్వతిదేవి, బర్డ్ ఇన్చార్జి డైరెక్టర్ డా.. వెంకారెడ్డి, ఎస్ఇ-1 శ్రీ రమేష్ రెడ్డి, డిఇ శ్రీ రవిశంకర్ రెడ్డి, ఇతర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
————————————————————–
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.
పత్రికా ప్రకటన :: జూన్ 29, తిరుపతి, 2019
జూలై 1 నుండి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో
భక్తులకు అంగప్రదక్షిణ టోకెన్ల జారీ
సిరులతల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జూలై 1 నుండి అంగప్రదక్షిణ చేయు భక్తులకు ముందు రోజు సాయంత్రం టోకెన్లను జారీ చేస్తారు. ప్రతిరోజు తెల్లవారుజామున 4.30 గంటలకు, శుక్రవారం మాత్రము 3.30 గంటలకు భక్తులను ఆలయంలో అంగప్రదక్షిణకు అనుమతిస్తారు.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం చెంత ఉన్న ఆస్థానమండపం సెల్లార్లో భక్తులు వేచి ఉండేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన హాల్లోని కౌంటర్ల నందు టోకెన్లు ఉచితంగా మంజూరు చేస్తారు. ఇందులో భాగంగా సోమ, మంగళ, బుధ, గురు, శని, ఆదివారాలలో 100 టోకెన్లు, శుక్రవారం అంగప్రదక్షిణ చేసేవారికి 150 టోకెన్లు ఇస్తారు. భక్తులు ఏదైన గుర్తింపు కార్డు (ఆధార్, ఓటర్, డ్రైవింగ్ లైసెన్స్, పాసుపోర్టు, పాన్‌కార్డు తదితర) చూపించి టోకెన్లు పొందవచ్చు. ఈ విషయాన్ని గమనించవలసిందిగా విజ్ఞప్తి చేయడమైనది.
—————————————————————-
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.