26-May-2019 News Clips
పద్మావతీ పరిణయం ఇక నేత్ర పర్వం
బొమ్మలతో వివరించేలా ఏర్పాట్లు : సరికొత్త సాంకేతికతతో ధర్మప్రచారం
ఈనాడు, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం సాంకేతికత ద్వారా ధర్మ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే ఏ ఆలయంలో ఇప్పటివరకు లేని సాంకేతికతను భక్తులకు పరిచయం చేస్తోంది. ‘ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ’ ద్వారా పద్మావతి శ్రీనివాస కల్యాణం జరిగిన తీరును భక్తులకు కళ్లకు కట్టినట్లు చూపేలా ఏర్పాట్లు చేసింది. సరికొత్త సింట్రిల్లా సాంకేతిక పరిజ్ఞానంతో హైదరాబాద్‌కు చెందిన సంస్థ దీన్ని రూపొందించింది. తితిదే జేఈవో లక్ష్మికాంతం దీనికి కావాల్సిన సరంజామాను అందించారు. తితిదే ఆగమ శాస్త్ర సలహాదారుల సూచనల మేరకు పద్మావతీ కల్యాణం జరిగిన తీరును పూర్తిస్థాయిలో వివరించేలా ప్రదర్శనకు రూపుదిద్దారు. చదువురాని వారు, చిన్నారులు సైతం చేతిలో సెల్‌ఫోన్ ఉంటే చాలు స్కాన్ చేసి.. బొమ్మలు చెప్పే పరిణయ క్రమాన్ని చూడొచ్చు. వినొచ్చు. శుక్రవారం నుంచి ఈ ప్రదర్శన అందుబాటులోకి వచ్చింది. అమ్మవారి దర్శనానికి రోజుకు సగటున 25వేలమంది వరకూ వస్తుంటారు. వీరిలో ఎక్కువభాగం ఫ్రైడేగార్డెన్లో సేద తీరుతారు. ఆ సమయంలో వీరికి ఇది ఆధ్యాత్మిక చింతన కలిగిస్తుందని తితిదే భావించి ఈ ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఈ ప్రదేశంలో మొత్తం 31 వినాయిల్ బోర్డులు ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చిన భక్తులు ఆ పరిణయ వేడుకలను బోర్డుల ద్వారా చూడాలంటే గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి పద్మావతి పరిణయం అని టైపు చేసి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మొదటి బోర్డు వద్దకు (మొత్తం 31) వెళ్లి అక్కడున్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. స్కాన్ అనంతరం ఒక్కొక్క బోర్డు వద్ద ఆరడుగుల దూరంలో నిలబడి బోర్డులకు సెల్‌ఫోన్ చూపాలి. అప్పుడు బొమ్మలు చెప్పే కథాంశం ఫోన్లో ప్రారంభమవుతుంది. ఒక్కొక్క బోర్డు వద్ద 20 సెకన్ల నుంచి 40 సెకన్ల వరకు నిడివి ప్రదర్శన ఉంటుంది. అలా 30 బోర్డుల్లోని కథాంశాలు అమ్మవారి జననం నుంచి వివాహం వరకూ వరుసగా వస్తూంటాయి. దీన్ని వినియోగించే సమయంలో హెడ్ఫోన్లు పెట్టుకోవాలి. ప్రాజెక్టుకు రూ.15 లక్షల వరకు ఖర్చయింది. దిల్లీ, నెల్లూరుకు చెందిన ఇద్దరు దాతలు ఈ వ్యయాన్ని తమ భుజాన వేసుకున్నారు. అమ్మవారి వివాహ ఘట్టాల్లో కీలకమైన అధ్యాయాలపైకి పూర్తిస్థాయి పరిశోధన చేసిన జేఈవో లక్ష్మికాంతం దీన్ని రూపొందించడంలో కీలకపాత్ర పోషించారు.
* మారుతున్న కాలానికి తగ్గట్లుగా హిందూ ధర్మప్రచారాన్ని సాంకేతికతను జోడించి జనంలోకి తీసుకెళ్లే క్రమంలో ఈ ప్రాజెక్టు కీలకం. దేశంలో ఎక్కడాలేని విధంగా ఈ ప్రాజెక్టును తిరుచానూరులో మొదలుపెట్టాం. దీనివల్ల సాధారణ భక్తులకు సైతం అమ్మవారి పరిణయక్రమం తెలుస్తుంది.

















