29-03-2019-NewsClips
శుక్రవారం, మార్చి 29, 2019
తితిదే విద్యాసంస్థల్లో ప్రవేశానికి ఆన్లైన్ దరఖాస్తులు
అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న ఈవో సింఘాల్
తిరుపతి(తితిదే), న్యూస్‌టుడే: తితిదే విద్యాసంస్థల్లో ప్రవేశానికి విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోనేలా, విద్యార్థులకు సాంకేతిక సమస్య లేకుండా తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో దరఖాస్తులు అందుబాటులో ఉంచుతున్నట్లు తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో గురవారం ఐటీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా ఇటీవల ప్రారంభించిన తితిదే హెచ్డీపీపీ వెబ్సైట్లో ధార్మిక విషయాలు భక్తులను ఆకట్టుకునేలా రూపొందించాలన్నారు. శ్రీవారి దర్శనార్థం దేశవిదేశాల నుంచి విచ్చేసే భక్తులకు సేవలు అందించే శ్రీవారి సేవకులు ఆన్లైన్లో సులువుగా దరఖాస్తు చేసుకునేలా అప్లికేషన్లో మార్పులు చేయాలన్నారు. దీని కారణంగా మరింత పారదర్శకంగా, మెరుగైన సేవలందించేందుకు వీలు ఉంటుందని వివరించారు. తితిదే స్థానికాలయాల్లో నూతనంగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ ద్వారా సేవా టికెట్లు పొందడానికి తయారు చేసిన అప్లికేషన్‌కు భక్తుల నుంచి ఆదరణ లభిస్తోందని, ఒంటిమిట్ట ఆలయ ఆర్జితసేవ టికెట్లను భక్తులు ఆన్లైన్లో పొందేలా అప్లికేషన్ రూపొందించాలని ఆదేశించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని తితిదే కల్యాణ మండపాల బుకింగ్ ఆన్లైన్లో చేసుకునే సదుపాయాన్ని కల్పించామని, ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ సేవలు అందేలా చూడాలన్నారు. సమావేశంలో తిరుమల జేఈవో శ్రీనివాసరాజు, తిరుపతి జేఈవో లక్ష్మీకాంతం, సీఈ చంద్రశేఖర్‌రెడ్డి, ఎఫ్ఏ, సీఏవో బాలాజీ, ఐటి విభాగాధిపతి శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.