23-March-2019-NewsClips

వసతి సముదాయాల్లో జేఈవో తనిఖీలు
సత్రాల అధికారులపై ఆగ్రహం

భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తీసుకుంటున్న జేఈవో
తిరుపతి(తితిదే), న్యూస్‌టుడే: తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీ గోవిందరాజస్వామి మూడు సత్రాలను శుక్రవారం తితిదే తిరుపతి జేఈవో బి.లక్ష్మీకాంతం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా గదులు, తాగునీటి వసతి, లాకర్ల సదుపాయం, ప్రథమ చికిత్స కేంద్రాలు, గదుల కేటాయింపు, సర్వదర్శనం టైమ్‌స్లాట్, డాగ్ స్క్వాడ్‌ను పరిశీలించారు. సత్రాల వద్ద పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని, గదుల్లో ప్రతిరోజు బెడ్షీట్లు మార్చాలని, తాగునీటి సమస్య లేకుండా భక్తులకు అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి సముదాయాల్లో ఉన్న భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వసతి సముదాయాల్లో యాత్రికులకు సులువుగా గదులు లభ్యమయ్యేలా, గదుల్లో అన్ని సౌకర్యాలు ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. మెరుగైన పరిశుభ్రత చర్యలు చేపడతామని, విద్యుత్తు, తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సీసీ టీవీలతో పాటు, డీఎఫ్ఎండీ ఏర్పాటు చేసి భద్రతను మరింత పటిష్ఠం చేయనున్నట్లు చెప్పారు. పచ్చదనం పెంచి ఆహ్లాదంగా తీర్చిదిద్దుతామని, ఓవర్ హెడ్ ట్యాంక్‌లో క్లోరినేషన్ చేస్తామని, సత్రాల్లో మెరుగైన పారిశుద్ధ్యం కోసం అధికారులు నిత్యం పర్యవేక్షణ చేపట్టేలా ఆదేశించినట్లు పేర్కొన్నారు. సత్రాల్లో అవసరమైన మరమ్మతులు చేపట్టి భక్తులకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. జేఈవో వెంట ఎస్ఈ1 రమేష్‌రెడ్డి, డిప్యూటీ ఈవో లక్ష్మీనరసమ్మ, డీఈ రవిశంకర్‌రెడ్డి, ఏఈవో గీత, అదనపు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సునీల్‌కుమార్, ఏవీఎస్వో రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
రేపటి నుంచి నాగలాపురంలో సూర్యపూజోత్సవం
తిరుపతి(తితిదే), న్యూస్‌టుడే: తితిదేకి అనుబంధ ఆలయమైన నాగలాపురంలోని శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణ స్వామి వారి వార్షిక సూర్యపూజ మహోత్సవం, తెప్పోత్సవాలు ఈనెల 24 నుంచి 28వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. శ్రీ మహావిష్ణువు మత్స్యావతార రూపంలో సముద్రంలో సంవత్సరాల తరబడి యుద్ధం చేసి వచ్చినందున స్వామి దివ్య శరీరానికి వెచ్చదనం కలిగించేందుకు సూర్య భగవానుడు తన కిరణాలను స్వామివారి మీద ప్రసరింపచేడమే సూర్యపూజోత్సవం. ఉత్సవంలో ప్రధాన రాజగోపురం నుంచి 630 అడుగుల దూరంలో ఉన్న మూలవిరాట్‌పై సూర్యకిరణాలు నేరుగా ప్రసరిస్తాయి. మొదటి రోజు స్వామివారి పాదాలపై, రెండో రోజు నాభిపై, మూడో రోజు స్వామి శిరస్సుపై సూర్యకిరణాలు ప్రసరించి స్వామి దివ్యరూపాన్ని మరింత తేజోవంతం చేస్తాయి. ఇందులో భాగంగా 24 నుంచి 28వ తేదీ వరకు జరగనున్న వార్షిక సూర్యపూజ మహోత్సవం, తెప్పోత్సవాల్లో రోజూ ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు భక్తులకు సూర్యపూజ దర్శనం కల్పిస్తారు. రాత్రి 7.30 నుంచి 9గంటల వరకు తిరువీధి ఉత్సవం జరగనుంది.
తెప్పోత్సవాలు
ఆలయంలో 24 నుంచి 28వ తేదీ వరకు ఐదు రోజుల పాటు తెప్పోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ప్రతిరోజూ సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. మొదటి రోజు శ్రీదేవి భూదేవి సమేత వేదనారాయణస్వామి వారు, రెండో రోజు గోదాదేవి సమేత వేదనారాయణస్వామి, మూడో రోజు సీతా లక్ష్మణ సమేత కోదండరామస్వామి, నాలుగు, ఐదో రోజు శ్రీదేవి భూదేవి సమేత వేదనారాయణస్వామి తెప్పలపై విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. తెప్పోత్సవాల్లో భాగంగా మొదటి రోజు తిరుచ్చి ఉత్సవం, నాలుగో రోజు ముత్యపు పందిరి వాహనం, ఐదో రోజు పెద్దశేష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.
8న మత్స్య జయంతి
ఆలయంలో ఏప్రిల్ 8న మత్స్య జయంతిని ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం 5గంటలకు సుప్రభాతం, తోమాల, అర్చన నిర్వహిస్తారు. 6.30 నుంచి 8.30 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత వేదనారాయణస్వామి వారికి మత్స్య జయంతి ఉత్సవం నిర్వహించనున్నారు. 9 నుంచి 11గంటల వరకు శాంతిహోమం, 11.30 నుంచి 12.30 గంటల వరకు స్నపన తిరుమంజనం చేపడతారు. సాయంత్రం 6.30 నుంచి 8.30గంటల వరకు గరుడ వాహనంపై స్వామి వారు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు.