పత్రికా ప్రకటన తిరుపతి, 2019 మార్చి 16
ఎస్వీ బదిర పాఠశాల, ఆయుర్వేద ఆసుపత్రిలో జెఈవో తనిఖీలు
టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం శనివారం తిరుపతిలోని ఎస్వీ బదిర పాఠశాల, ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి, వికలాంగుల శిక్షణ కేంద్రం, టిటిడి కాల్ సెంటర్‌ను పరిశీలించారు. అక్కడి వసతులను పరిశీలించి మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఎస్వీ బదిర పాఠశాలలో విద్యార్థులు బాగా చదువుకుంటున్నారని, ప్రశ్నిస్తే చక్కగా స్పందిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, రక్షిత తాగునీరు అందిస్తున్నామన్నారు. మౌలిక సదుపాయాలను మరింతగా మెరుగుపరుస్తామని చెప్పారు. అవసరమైన మరమ్మతులను వెంటనే చేపట్టాలని అధికారులకు ఆదేశించామన్నారు. సిబ్బంది కొరతపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వికలాంగుల శిక్షణ కేంద్రంలోని ఫిట్టర్, టర్నర్ తదితర విభాగాల్లో విద్యార్థుల ప్రగతిని పరిశీలించారు. వికలాంగ విద్యార్థుల కోసం అనువుగా మంచాలు ఏర్పాటు చేస్తామన్నారు. శ్రీ గోవిందరాజస్వామి హాస్టల్ భవనంలో రూ.1.1 కోట్లతో అభివృద్ధి, మరమ్మతు పనులు చేయనున్నట్టు తెలిపారు.
ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రికి వైద్యం కోసం ఎక్కువమంది వస్తున్నారని, అదనపు ఓపి బ్లాక్ కోసం ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని జెఈవో వెల్లడించారు. అత్యవసర వైద్యం కోసం వచ్చే రోగుల కోసం రెండు వార్డుల్లో ఎసి సౌకర్యం కల్పిస్తామన్నారు. ఆసుపత్రిలో మెరుగైన పారిశుద్ధ్యం కోసం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు తగిన చర్యలు చేపడతామన్నారు. టిటిడి కాల్‌సెంటర్ ద్వారా 24 గంటల పాటు భక్తులకు కచ్చితమైన సమాచారం అందిస్తున్నామని తెలిపారు. భక్తుల సలహాలు, సూచనలను వెంటనే ఆయా విభాగాలకు తెలియజేసి సత్వరం పరిష్కార చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి టైంస్లాట్ సర్వదర్శనం, దివ్యదర్శనం తదితర టికెట్ల సమాచారాన్ని భక్తులకు తెలియజేసేలా కాల్ సెంటర్లో తగిన ఏర్పాట్లు చేపడతామన్నారు. కాల్ సెంటర్, వాట్స్ యాప్, ఈ-మెయిల్ ద్వారా భక్తులు తమ సలహాలు, సూచనలు, ఫిర్యాదులను టిటిడికి తెలియజేవచ్చని తెలిపారు.
జెఈవో వెంట టిటిడి ఎస్ఇ-1 శ్రీ రమేష్‌రెడ్డి, ముఖ్య వైద్యాధికారి డా.. నాగేశ్వరరావు, డెప్యూటీ ఈవో శ్రీమతి భారతి, అదనపు ఆరోగ్యశాఖాధికారి డా.. సునీల్‌కుమార్ ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు.
——————————————————————–
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.