08-March-2019-News-Clips
విమానాశ్రయాల తరహాలో హరితశోభ
రోడ్ల మధ్య పచ్చదనాన్ని పరిశీలిస్తున్న జేఈవో
తిరుపతి(తితిదే), న్యూస్‌టుడే: తిరుపతి సుందరీకరణలో భాగంగా తితిదే పరిధిలోని 26కిలోమీటర్ల మేర నిర్వహిస్తున్న 9రోడ్లలో పచ్చదనాన్ని మరింత పెంచి ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతామని తితిదే తిరుపతి జేఈవో బి.లక్ష్మీకాంతం తెలిపారు. తిరుపతిలోని తితిదే రోడ్లు, ముద్రణాలయం, ప్రచురణల విభాగం, సప్తగిరి మాసపత్రిక కార్యాలయం, ప్రచురణల విక్రయ విభాగాలను గురువారం జేఈవో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విమానాశ్రయాల తరహాలో హరితశోభ పెంచి తిరుపతిని సుందర నగరంగా మారుస్తామన్నారు. రోడ్ల మధ్యగల డివైడర్లలో రంగురంగుల పూల మొక్కలు పెంచనున్నట్లు చెప్పారు. డ్రిప్ ఏర్పాటు చేసి మొక్కలకు నీటిసమస్య లేకుండా చూస్తామన్నారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి నిలయం వసతి సముదాయం, ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయం, హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో నిర్మించిన శ్రీవారి ఆలయాల్లో పచ్చదనాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. సప్తగిరి మాసపత్రిక సక్రమంగా అందడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని, మొత్తం ఒక లక్షా పదివేల మంది పాఠకులకు క్రమం తప్పకుండా పత్రిక అందేలా ఎప్పటికప్పుడు చిరునామాలు అప్డేట్ చేయాలని సూచించారు. ప్రచురణల విభాగం కార్యాలయంలో గాలి వెలుతురు సరిగ్గా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రచురణల విక్రయ విభాగంలోని ఆధ్యాత్మిక గ్రంథాలయాన్ని మరింత ఎక్కువ మంది పాఠకులు సందర్శించేలా ప్రచారం కల్పిస్తామన్నారు. అంతకుముందు అలిపిరి నుంచి నంది కూడలి, లీలామహల్ కూడలి, మంగళం రోడ్, రామానుజ కూడలి, తిరుచానూరు రోడ్, లక్ష్మీపురం కూడలి, అన్నమయ్య కూడలి, ఎమ్మార్‌పల్లి కూడలి, బాలాజీ కాలనీ, శ్రీ పద్మావతి విశ్రాంతి గృహం వరకు ఉన్న రోడ్ల మధ్యలో పచ్చదనాన్ని పరిశీలించారు. జేఈవో వెంట తితిదే డీఎఫ్‌వో విజయకుమార్, ఎస్ఈ-1 రమేష్‌రెడ్డి, చీఫ్ ఎడిటర్ డాక్టర్ రాధారమణ, డిప్యూటీ ఈవోలు విజయకుమార్, హేమచంద్రారెడ్డి, ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి డాక్టర్ టి.ఆంజనేయులు తదితరులు ఉన్నారు.