05-March-2019-News-Clips
అటవీ స్థలంతో కపిలేశ్వరాలయం విస్తరణ
అటవీశాఖకు చెందిన స్థలాన్ని పరిశీలిస్తున్న జేఈవో లక్ష్మీకాంతం
తిరుపతి(కపిలతీర్థం), న్యూస్‌టుడే: తిరుపతి శ్రీకపిలేశ్వరాలయానికి సమీపంలోని అటవీశాఖకు చెందిన స్థలాన్ని తీసుకుని ఆలయాన్ని విస్తరిస్తూ… అభివృద్ధి చేస్తామని తితిదే తిరుపతి జేఈవో లక్ష్మీకాంతం పేర్కొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా సోమవారం ఉదయం కపిలేశ్వరస్వామిని దర్శించుకుని.. అక్కడి ఏర్పాట్లు, సౌకర్యాలను పరిశీలించారు. భక్తులతో మాట్లాడి అక్కడి సౌకర్యాలపై ఆరా తీశారు. తాగునీటి సదుపాయం, ప్రసాదాల నాణ్యత, క్యూలైన్ల నిర్వహణ తెలుసుకున్నారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో జరిగే నాలుగు కాలాల లింగోద్భవ అభిషేకం సమయంలో సర్వదర్శన క్యూలైన్లు వదలాలని డిప్యూటీ ఈవోను ఆదేశించారు. అనంతరం ఆలయం విస్తరణ గురించి అధికారులను అడిగారు. గతంలోనే అటవీశాఖ స్థలం నిమిత్తం ప్రతిపాదనలు పంపామని.. ప్రస్తుతం తితిదేలోని ఓ శాఖ వద్ద దస్త్రం పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. దానికి సంబంధించిన దస్త్రాలతో త్వరలో తనను కలిస్తే చర్యలు తీసుకుందామన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి అవసరమైన స్థలం తీసుకోవడానికి అటవీ శాఖ అధికారులతో చర్చిస్తామని చెప్పారు. స్థలాభావం కారణంగా ఆలయం అభివృద్ధి కొంత వెనుకబడిందన్నారు. మహాశివరాత్రి ఏర్పాట్లు బాగున్నాయని, భక్తులు సంతృప్తిగా ఉన్నట్లు చెప్పారు. తనిఖీలో ఆలయ డిప్యూటీ ఈవో సుబ్రహ్మణ్యం, ఏఈవో నాగరాజు, సూపరింటెండెంట్ రాజ్‌కుమార్, పీఆర్ఓ టి.రవి తదితరులు పాల్గొన్నారు.