12-February-2019-News-Clips-TTD-Tirupati

అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న జేఈవో లక్ష్మీకాంతం
స్థానికాలయాల్లో విస్తృత ఏర్పాట్లు
తిరుపతి(తితిదే), న్యూస్టుడే: తితిదేకు అనుబంధంగా ఉన్న తిరుపతి, పరిసర ప్రాంతాల్లోని ఆలయాల్లో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని తితిదే తిరుపతి జేఈవో బి.లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో సోమవారం రథసప్తమి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ.. 12న మంగళవారం తితిదే స్థానికాలయాలైన శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, శ్రీ కోదండరామాలయం, తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం, చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయం, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం, కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం, నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామి ఆలయాల్లో అంగరంగ వైభవంగా నిర్వహించాలన్నారు. భక్తులకు సురక్షిత తాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదాలు అందించాలన్నారు. ఆలయ పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి భక్తుల రద్దీ అనుగుణంగా భద్రతా సిబ్బందిని నియమించాలన్నారు. వాహన సేవలలో ఆలయ పరిసరాల్లో హిందూ ధర్మప్రచార పరిషత్తు, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు, భక్తి సంగీత కార్యక్రమాలు కనువిందు చేసేలా ప్రదర్శనలు పెట్టాలన్నారు. కార్యక్రమంలో ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో గౌతమి, స్థానికాలయాల డిప్యూటీ ఈవోలు ఝాన్సీరాణి, వరలక్ష్మి, శ్రీధర్, సుబ్రహ్మణ్యం, ఎస్ఈలు శ్రీరాములు, వెంకటేశ్వర్లు, డీఎఫ్వో ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు.
విభాగాల కార్యాలయాల పరిశీలన
తిరుపతి జేఈవో బి.లక్ష్మీకాంతం సోమవారం తితిదే పరిపాలనా భవనంలోని వివిధ విభాగాల కార్యాలయాలను, తితిదే ఉద్యోగుల క్యాంటీన్, ఆసుపత్రి, ఉద్యానవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు ధరించాలని, సమయపాలన పాటించాలని, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.