22-December-2018-News Clips
శనివారం, డిసెంబర్ 22, 2018
అడవిలో.. సాహస వేడుక
జనవరి 27, 28 తేదీల్లో వేడుక
తరలిరానున్న దేశ, విదేశాల క్రీడాకారులు
కొండపల్లి కోట, అటవీ ప్రాంతంలో నిర్వహణ
ఈనాడు, అమరావతి
అమరావతి రాజధాని ప్రాంతం మరో అంతర్జాతీయ వేడుకకు వేదిక కాబోతోంది. నీటిలో బోట్ రేసింగ్, గాలిలో ఎయిర్షోలను నిర్వహించిన కృష్ణా జిల్లా యంత్రాంగం తాజాగా.. అటవీ ప్రాంతంలో మరో అంతర్జాతీయ వేడుక నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. ‘కొండపల్లి అడ్వెంచర్ ఫెస్టివల్ 2018’ పేరుతో జనవరి 27, 28 రెండు రోజుల వేడుకను నిర్వహించనున్నారు. కొండపల్లి అటవీ ప్రాంతం, కోట, చుట్టుపక్కల ఉండే అద్భుత ప్రకృతి వనరులను పర్యాటకంగా అభివృద్ధి చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. పర్యాటక, అటవీశాఖలు సహకారం అందిస్తున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటూ విదేశాల నుంచి సైతం ఈ సాహస వేడుకలో పాల్గొనేందుకు ప్రకృతి ప్రేమికులు, క్రీడాభిమానులు తరలిరానున్నారు. పెద్దవాళ్లతో పాటూ చిన్నారుల కోసం ప్రత్యేకంగా 13 రకాల సాహస క్రీడలు, వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రీడా పోటీలన్నీ ఏక కాలంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిపుణుల సారథ్యంలో అటవీ ప్రాంతంలో వేర్వేరుగా జరగనున్నాయి.
రసవత్తరంగా పోటీలు..
కొండపల్లి సాహస వేడుకల్లో భాగంగా దేశవిదేశాల నుంచి తరలివచ్చే వారికి పోటీలను నిర్వహించనున్నారు. ఈ పోటీలు పెద్దలు, పిల్లలకు వేర్వేరుగా ఉంటాయి. ప్రధానంగా ప్రకృతిని భాగస్వామ్యం చేసేలా, శారీరక, మానసిక సంబంధిత క్రీడలను నిర్వహిస్తున్నారు. ట్రెక్కింగ్, రాక్‌క్లైంబింగ్, రాప్లింగ్, జుమెరింగ్, జిప్‌లైన్, జోర్బింగ్, ఆర్చరీ, కమాండో నెట్, బుర్మాబ్రిడ్జ్, ట్రెజర్‌హంట్, స్లాక్‌లైన్ వంటి సాహస క్రీడల్లో అంతర్జాతీయస్థాయి పోటీలను నిర్వహిస్తున్నారు. వీటికితోడు.. చిన్నారుల కోసం క్విజ్, ప్రకృతిపై చిత్రలేఖనం పోటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు, జ్ఞాపికలను ప్రదానం చేయనున్నారు.
సోమవారం నుంచి దరఖాస్తులు..
జనవరి 10వ తేదీలోగా ఈ పోటీలలో పాల్గొనే వారు దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. సోమవారం నుంచి దరఖాస్తులను ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ప్రతి రాష్ట్రం నుంచి కచ్చితంగా భాగస్వామ్యం ఉండేలా ఆహ్వానిస్తున్నారు. విదేశాల నుంచి సైతం ప్రతినిధులు వచ్చి పాల్గొంటారని యూత్ హాస్టల్స్ విజయవాడ ఛైర్మన్ నందం విష్ణువర్ధన్ వెల్లడించారు.
మూలపాడులో బేస్‌క్యాంప్..
కొండపల్లి కోట, మూలపాడు అటవీ ప్రాంతాలు వేదికగా ఈ సాహక పండుగ జరుగుతుంది. కొండపల్లి కోట వద్ద రాక్‌క్లైంబింగ్, రాఫ్లింగ్, జుమ్మెరింగ్, జిప్‌లైన్ లాంటి సాహస క్రీడలను నిర్వహిస్తారు. మూలపాడు అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్, ఆర్చరీ, కమాండో నెట్, ట్రెజర్ హంట్, స్లాక్‌లైన్, చిత్రలేఖనం వంటి పోటీలు జరుగుతాయి. మూలపాడు క్రికెట్ స్టేడియం సమీపంలో అడవిని ఆనుకుని ఉండే విశాలమైన ప్రదేశంలో బేస్ క్యాంప్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడే అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. 500 మందికి సరిపడేలా టెంట్లు, ఆహారం, వసతులను ఇక్కడ అందుబాటులో ఉంచనున్నారు. ఒక రాత్రి కూడా ఇక్కడే బస చేయనున్నారు.
చిత్రలేఖనం పోటీలు..
చిన్నారులు, పెద్దలు అందరూ పాల్గొనేలా చిత్రలేఖనం పోటీలను నిర్వహిస్తున్నారు. మూలపాడులోని బేస్ క్యాంప్ వద్ద ఈ పోటీలు జరుగుతాయి. ప్రకృతిని చూస్తూ.. వారికి కనిపించిన దృశ్యాలను స్పాట్ పెయింటింగ్‌గా వేయాలి. ఐదేళ్ల నుంచి 16ఏళ్ల వరకూ సబ్ జూనియర్, జూనియర్, 17-25ఏళ్ల వరకూ ఒకటి, ఆపైన వారంతా మరో విభాగంగా పోటీల్లో పాల్గొనొచ్చు.
అడవిలో ట్రెజర్‌హంట్..
కొండపల్లి అటవీ ప్రాంతంలో ట్రెజర్ హంట్‌ను నిర్వహిస్తారు. దీనిని కూడా నాలుగు విభాగాలుగా వయసుల ఆధారంగా ఏర్పాటు చేస్తున్నారు.
క్విజ్..
అమరావతి ప్రాంతం, కొండపల్లి కోట, ప్రకృతి, అటవీ ప్రాంతానికి సంబంధించిన అంశాలలో చిన్నారులకు క్విజ్ పోటీలను నిర్వహిస్తారు.
అందరూ పాల్గొనేలా..
అంతర్జాతీయ, జాతీయ స్థాయి క్రీడాకారులు ఈ సాహస పోటీల్లో పాల్గొననున్నారు. ఇప్పటికే ఈ సాహస క్రీడా పోటీల నిర్వహణకు అవసరమైన సహకారం కోసం దిల్లీలోని యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనుమతి తీసుకున్నాం. మహిళలు, చిన్నారులు, యువత, పెద్దలు అందరూ పాల్గొనేలా క్రీడలను రూపొందించాం.
సాహస క్రీడలు ఇవే..
సాహస పోటీలను మహిళలు, పాఠశాల, కళాశాలల విద్యార్థులు, సాధారణ ప్రజలకు వేర్వేరుగా ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిర్వహించనున్నారు. ఏ విభాగానికి చెందినవాళ్లు.. దానిలో పాల్గొనాల్సి ఉంటుంది. ఇలా రోజూ కనీసం 500 మంది పోటీలలో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తారు. రెండు రోజుల్లో వెయ్యి మంది సాహస క్రీడల్లో ప్రత్యక్షంగా పాల్గొననున్నారు. రెండు రోజుల్లో వెయ్యి మంది వరకూ పాల్గొనగా, తిలకించేవారి సంఖ్య భారీగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
రాప్లింగ్: తాడును నడుముకు కట్టుకుని.. కొండ పైభాగం నుంచి కిందకు దిగడం. కాళ్లను కొండపై ఉంచి.. చేతులతో తాడు పట్టుకుని కిందకు దిగే ఈ సాహస క్రీడా పోటీలు రసవత్తరంగా ఉంటాయి.
రాక్‌క్లైంబింగ్: తాడును నడుముకు కట్టుకుని.. చేతితో రాళ్లను పట్టుకుంటూ కొండపైకి వెళ్లడం. ఇదికూడా ఆసక్తికరమైన సాహస క్రీడ.
జుమ్మెరింగ్: తాడును చేతులతో పట్టుకుని.. ఎగబాకుతూ పైకి వెళతారు. శరీరాన్ని రాతికి ఆనించి.. చేతులతో తాడును పట్టుకుని కొండపైకి వెళతారు.
ట్రెక్కింగ్: అటవీ ప్రాంతంలోనికి నడుచుకుంటూ 5-8కిలోమీటర్ల దూరం వెళతారు. పాఠశాలల విద్యార్థులు, మహిళలకు 5కిలోమీటర్లు, మిగతా వారికి 8కిలోమీటర్లు అడవిలోనికి తీసుకెళతారు.
జిప్‌లైన్: రెండు కొండల మధ్య తాడును కడతారు. ఆ తాడుకు తాళ్లతో వేళాడుతూ వెళ్లే సాహస క్రీడ ఇది. పాల్గొనే వారితో పాటూ చూసేందుకూ ఒళ్లు గగుర్పొడిచే సాహక క్రీడ ఇది.
కమాండో నెట్: ఇది చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినది. రెండు భారీ చెట్ల మధ్యలో కట్టిన దృఢమైన వలను పట్టుకుని పైకి వెళ్తూ.. చిన్నారులు వినోదం పొందుతారు. మూడేళ్ల నుంచి 16 ఏళ్ల వరకూ మూడు విభాగాలుగా దీనిలో పాల్గొనే అవకాశం కల్పిస్తారు.
ఆర్చరీ: అడవి మధ్యలో పచ్చని చెట్ల కిందన ఆర్చరీ పోటీలను సైతం పిల్లల కోసం నిర్వహిస్తున్నారు.
జోర్బింగ్: కొండపై నుంచి బెలూన్‌లో ఉంటూ దొర్లుతూ కిందకు వచ్చే సాహస క్రీడ ఇది.
ఆర్టీజీఎస్ యాప్‌లో పంట నష్టం వివరాలు
ఇప్పటికీ 3,318 మంది రైతులు, 3,791 ఎకరాల నమోదు: కలెక్టర్
విజయవాడ సబ్‌కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలో పెథాయి తుపాను పంట నష్టం వివరాలను ఆర్టీజీఎస్ యాప్‌లో వేగవంతంగా నమోదు చేస్తున్నట్లు కలెక్టర్ బి.లక్ష్మీకాంతం శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకూ 3,318 మంది రైతులు, 3,791 ఎకరాల వివరాలను నమోదు చేసినట్లు వెల్లడించారు. వీరిలో 2,807 మంది రైతులకు చెందిన 3,320 ఎకరాలు వ్యవసాయ శాఖ పరిధిలో ఉండగా, ఉద్యాన శాఖ ద్వారా 511 మంది రైతులకు చెందిన 471 ఎకరాలు ఉన్నట్లు వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను వల్ల నష్టపోయిన పంట వివరాలను నమోదు చేసిన తరహాలోనే, ఇక్కడ కూడా పెథాయి తుపాను నష్టాన్ని పారదర్శకంగా నమోదు చేస్తున్నట్టు పేర్కొన్నారు. పంట నష్టపోయిన రైతును అదే పొలంలో ఉంచి, ఫొటో తీసి, యాప్ నుంచి అప్లోడు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పంట నష్టం వివరాల నమోదు వేగంగా జరుగుతోందని, రైతులు అధికారులకు సహకరించాల్సిందిగా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
ధాన్యం కొనుగోళ్లకు రూ.297.85 కోట్ల చెల్లింపులు.. జిల్లాలో 256 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకూ 19,458 మంది రైతుల నుంచి 1,93,890 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు కలెక్టర్ తెలిపారు. ఈక్రమంలో రైతులకు రూ.342.80 కోట్లను చెల్లించాల్సి ఉండగా, 16,709 మంది రైతులకు ఇప్పటి వరకూ రూ.297.85 కోట్లను చెల్లించినట్లు పేర్కొన్నారు. మిగతా 2,749 మంది రైతులకు రూ.44.95 కోట్లను త్వరలో ఇవ్వనున్నట్లు తెలిపారు.
గ్రామదర్శినితో అభివృద్ధి సాధ్యమని నిరూపించాం
కంకిపాడు గ్రామీణం, న్యూస్‌టుడే: గ్రామదర్శినితో గ్రామాల అభివృద్ధి సాధ్యమని జిల్లాలో పనితీరును బట్టి నిరూపితమైందని కలెక్టరు లక్ష్మీకాంతం అన్నారు. పెనమలూరు నియోజకవర్గంలో ప్రభుత్వ పనితీరుపై 85 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్పారు. శుక్రవారం కంకిపాడులోని పంచాయతీ కార్యలయంలో జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజలు, మహిళలు, విద్యార్థులతో మాట్లాడారు. వివిధ ప్రభుత్వ శాఖల పనితీరు, మౌలిక వసతుల కల్పనపై ఆరా తీశారు. ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి వివరాలను చదివి వినిపించారు. వివిధ శాఖల అధికారుల నివేదికలపై ప్రజల అభిప్రాయం తీసుకున్నారు. గర్భిణుల రక్తహీనతపై ప్రత్యేకంగా వాకబు చేశారు. గ్రామంలో ఇప్పటి వరకు 25 కి.మీ మేర రహదారులు, 23 కి.మీ. మురుగు కాల్వలు అభివృద్ధి చేసినట్లు చెప్పారు. మిగిలిన పనులను కూడా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పులిరామారావునగర్కు చెందిన పలువురు గ్రామస్థులు తమ సమస్యలను కలెక్టరు దృష్టికి తీసుకువచ్చారు. వీధి దీపాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాలువగట్టుపై నివశిస్తున్న వారికి శాశ్వత నివాసాలు నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి వెంకటరమణారెడ్డి, ఎంపీడీవో కృష్ణమోహన్, తహసీల్దారు ఎల్లారావు, సీడీపీవో ఉమాదేవి, విద్యాశాఖాధికారి కనకమహాలక్ష్మి, ఎంపీటీసీ సభ్యుడు కొండా నాగేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు, ఏఈఈలు, కార్యదర్శులు, వీఆర్వోలు సిబ్బంది పాల్గొన్నారు.