Teleconference-with-CM on 03-10-2018
గడచిన నాలుగేళ్లుగా కృష్ణా జిల్లా ప్రగతి భేష్..
* కృష్ణాజిల్లా సాధించిన ప్రగతిని అన్ని జిల్లాల ఆదర్శంగా తీసుకోవాలి
* టెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంస
* జిల్లా ప్రగతిని గణాంకాలతో సహా సీఎంకు వివరించిన కలెక్టర్ లక్ష్మీకాంతం
సెల్ఐటి న్యూస్, విజయవాడ: గడచిన నాలుగేళ్లుగా కృష్ణాజిల్లా సాధించిన ప్రగతిని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారని జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తెలిపారు. బుధవారం ఉదయం రాజధాని అమరావతి నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, శాఖాధిపతులతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కలెక్టరు లక్ష్మీకాంతం వివరించారు. తొలుత పౌర సరఫరాల శాఖలో భాగంగా జిల్లాలో నాలుగు సంవత్సరాలలో లక్షా 95 వేల తెల్లకార్డులను కొత్తగా లబ్దిదారులకు అందించామన్నారు. రూరల్ హౌసింగ్‌లో భాగంగా 79 వేల 644 గృహాలను మంజూరు చేస్తామన్నారు. వీటిలో 42 వేల 484 గృహాలు పూర్తి అయ్యాయన్నారు. అర్బన్ హౌసింగ్‌లో భాగంగా 9 వేల 743 గృహాలు మంజూరు చేస్తామని వీటిలో 1805 గృహాలు పూర్తి చేస్తామని మిగిలిన గృహాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఆదరణ పధకంలో భాగంగా కాపు కార్పోరేషన్ ద్వారా లబ్దిదారులకు రూ.120 కోట్లు అందించామని, 648 మంది యువతీ యువకులకు వృత్తిశిక్షణలో శిక్షణ అందించామన్నారు. యస్సీ, యస్టీ కార్పోరేషన్ ద్వారా 4 వేల 052 మంది గిరిజన తెగకు చెందిన లబ్దిదారులకు రూ.31.72 కోట్లు, 20 వేల 427 మంది షెడ్యూల్డు కులాల లబ్దిదారులకు రూ.296.94 కోట్లు రుణాలుగానూ, 100 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తులో భాగంగా 10 వేల 946 యస్టి కుటుంబాలకు రూ.2.37 కోట్ల మేర లబ్ధి చేకూర్చామని, చంద్రన్న బీమాలో భాగంగా 1533 మంది లబ్దిదారులకు రూ.5 లక్షల బీమాతో లబ్ది చేకూర్చామన్నారు. ఇప్పటివరకూ 1365 మంది లబ్దిదారులకు చంద్రన్న బీమాలో రూ.68.28 కోట్ల మేర అర్హులకు అందించామన్నారు. చంద్రన్న పెళ్లికానుకలో యస్సీ, యస్టి, బిసి, ఓసి ఉమెన్ లబ్దిదారులైన 447 మందికి రూ.1.33 కోట్లు అందించామని, 9వ తరగతి చదువుకుంటున్న బాలికలకు బడికొస్తా పధకంలో భాగంగా 13 వేల 970 సైళ్లను అందించామని కలెక్టరు అన్నారు.
నైపుణ్యాభివృద్ధిలో భాగంగా 10 వేలమందికి నైపుణ్యాన్ని పెంపొందించడంలో 45 శిక్షణా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. గ్రామీణ నీటిసరఫరా కార్యక్రమంలో భాగంగా గత నాలుగు సంవత్సరాలలో 1025 ఆవాస ప్రాంతాల్లో రూ.68.90 కోట్ల ఖర్చుతో త్రాగునీరు అందించామని, 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.36.99 కోట్లతో యస్సీ, యస్టీ కాలనీలతో కలిపి 79 ఆవాస ప్రాంతాలలో త్రాగునీరు అందించేలా ప్రణాళిక రూపొందించామన్నారు. డ్వాక్రా గ్రూపులకు ఋణాల మంజూరులో భాగంగా ఒక్కొక్కరికీ రూ.10 వేలు చొప్పున రూ.5.026 వేల కోట్ల రుణాలను అందించామన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవలో భాగంగా ఇప్పటివరకూ లక్షా 53 వేల 542 మంది నిరుపేద లబ్దిదారులకు రూ.45.470 కోట్ల మేర లబ్ది చేకూర్చామని, ముఖ్యమంత్రి వైద్య సహాయ పధకంలో భాగంగా 82 మంది లబ్ధిదారులకు చేకూర్చామన్నారు. గ్రామీణాభివృద్ధిలో చంద్రన్నబాట కార్యక్రమంలో భాగంగా రూ.591 కోట్లతో 1972 కిలోమీటర్లు సీసీ రోడ్లను నిర్మించామన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పధకంలో భాగంగా 290.62 లక్షల పనిదినాలు కల్పించి రూ.371 కోట్లు వేతనాలుగా చెల్లించామన్నారు. జిల్లాలో 39 వేల పంటకుంటల నిర్మాణ లక్ష్యానికి గాను నేటివరకూ 12 వేల 520 పంటకుంటలు నిర్మించామన్నారు. వ్యవసాయ శాఖలో 5.25 లక్షల భూసార పరీక్షా నిర్ధారణ కార్డులు మంజూరు చేయడంతో పాటు జిల్లాలోని రైతులందరికీ నూరుశాతం భూసార పరీక్షా నిర్ధారణ కార్డులు మంజూరు చేసిన జిల్లాగా ఘనత సాధించామన్నారు. 4.42 లక్షల మంది రైతులకు రూ.1036 కోట్లు వ్యవసాయ రుణమాఫీలో భాగంగా లబ్ది చేకూర్చామని కలెక్టర్ లక్ష్మీకాంతం జిల్లా సాధించిన ప్రగతిని ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. జిల్లాలోని 970 గ్రామ పంచాయతీల్లో నాలుగు సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రాధాన్యతా పధకాలలో సాధించిన ప్రగతిని గ్రామాలతో పాటు జిల్లా ప్రగతిని వివరించే విధంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశామని కలెక్టరు లక్ష్మీకాంతం తెలిపారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ శాఖల సమన్వయంతో కృష్ణాజిల్లా సాధించిన ప్రగతిని స్పూర్తిగా తీసుకుని ఇతర జిల్లాలు ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. టెలీకాన్ఫరెన్స్‌లో జెసి-2 పి.బాబూరావు, డిఆర్వో లావణ్యవేణి, జడ్పీ సిఈవో షేక్ సలాం, డ్వామా పిడి సి.గురుప్రకాష్రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.