గురువారం, జూలై 26, 2018 ఈనాడు
జక్కంపూడికి జై
బందరు పోర్టుకు మరో వెయ్యి ఎకరాలు
ఇకనుంచి ముఖగుర్తింపు ద్వారా రేషన్, పింఛను
కృష్ణా జిల్లా కలెక్టర్‌కు అవార్డుల పంట
ఈనాడు, విజయవాడ
జక్కంపూడి ఆర్థిక నగరానికి కావల్సిన భూసేకరణ సత్వరమే పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రాబాబునాయుడు ఆదేశించారు. రైతుల కోరిక మేరకు అక్కడ ఉన్న పరిహారం ఇవ్వాలని సీఎం సూచించినట్లు తెలిసింది. జక్కంపూడి భూములకు రైతులు ఎకరాకు రూ.కోటి పరిహారం కావాలని రైతులు కోరుతున్నారు. ఆ మేరకు ఇచ్చేందుకు సీఎం అంగీకరించారు. బందరు పోర్టుకు మరో వెయ్యి ఎకరాల సేకరణకు సీఎం అనుమతించారు. బుధవారం కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్షించారు. నాలుగేళ్లలో సాధించిన ప్రగతి ప్రాజెక్టుల తీరుపై చర్చించారు. అనంతరం కలెక్టర్లతో జిల్లా సమస్యలు ఏడాదిలో తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ముఖాముఖి నిర్వహించారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతంతో బుధవారం రాత్రి ముఖాముఖి జరిపారు. ఈ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఇలా ఉన్నాయి. జక్కంపూడి ఆర్థిక నగరం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం సూచించారు. టెండర్లను నిర్వహించి ఎల్అండ్టీ పనలు ప్రారంభించిందని కలెక్టర్ పురోగతిని వివరించారు. రైతుల నుంచి 106 ఎకరాలను సేకరించామని, దానికి ఎకరాకు రూ.కోటి పరిహారం అడుగుతున్నారని కలెక్టర్ వివరించారు. ఈసమస్యను వెంటనే పరిష్కరించి ఆమేరకు రైతులకు పరిహారం అందించాలని సూచించారు. భూ సమీకరణకు ముందుకు వస్తే పరిశీలించాలని సూచించారు. దానికి రైతుల నుంచి ఆసక్తి లేదని కలెక్టర్ వివరించినట్లు తెలిసింది. జెట్ సిటీకి మొత్తం 235 ఎకరాల వరకు అవసరం ఉంది. అక్కడే అర్బన్ హౌసింగ్ పథకానికి 70 ఎకరాలను సేకరించినట్లు కలెక్టర్ వివరించారు. బందరు పోర్టు నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేయాలని సూచించారు. దీనికి అవసరమైన 3,800 ఎకరాలను సిద్ధం చేశామని, కాంకర్డ్ కోసం మరో వెయ్యి ఎకరాలను సిద్ధం చేస్తున్నామని కలెక్టర్ వివరించారు. పోర్టు నిర్మాణానికి మొత్తం 4,800 ఎకరాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. గన్నవరం విమానాశ్రయం విస్తరణ సందర్భంగా రోడ్డు మళ్లింపు అవసరమైందని, దీనికి అనుమతి కావాలని కలెక్టర్ కోరారు. రోడ్డు మళ్లించేందుకు సీఎం అంగీకరించారు. జిల్లాలో పించన్ల పంపిణీకి, రేషన్ సరఫరాకు కొత్త విధానం ప్రవేశపెడుతున్నట్లు కలెక్టర్ వివరించారు. ఇంతవరకు బయో మెట్రిక్ ద్వారా వేలిముద్రలు వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇవి సమస్యలుగా మారాయి. బయోమెట్రిక్ స్థానంలో ముఖగుర్తింపు (ఫేషియల్ రికగ్నేషన్) చేసేవిధంగా మార్పులు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. దీనికి మంచి ప్రాధాన్యం ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. సభ్యుల ముఖ గుర్తింపు ద్వారా రేషన్ సరకులు పంపిణీ చేసే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా లబ్ధిదారులు ముఖాన్ని గుర్తించిన తర్వాత పించను సొమ్ము పంపిణీ చేసే అక్రమాలను నిరోధించనున్నారు. కార్పొరేషన్ జారీ చేస్తున్న రుణాల సబ్సిడీలు, వడ్డీలపై కొంత వెసులు బాటు కల్పించాలని సీఎంకు కలెక్టర్ సూచించారు. ముఖాముఖిలో కనకదుర్గ పైవంతెన నిర్మాణం, బెంజి సర్కిల్ ఇతర ప్రాజెక్టుల పురోగతిని వివరించారు.
అయిదు అవార్డులు..!: కలెక్టర్ బి.లక్ష్మీకాంతం మొత్తం అయిదు జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. ఉండవల్లి గ్రీవెన్సు హాలులో వీటిని సీఎం చంద్రబాబు నాయుడు అందించారు. జిల్లాకు మొత్తం ఆరు అవార్డులు రాగా వాటిలో అయిదు కలెక్టర్ గెలుచుకోవడం విశేషం.
* బి.లక్ష్మీకాంతం అనంతపురం జిల్లా సంయుక్త కలెక్టర్‌గా ఉన్న సమయంలో డిజిటల్ ఇండియా2015 కార్యక్రమాలను నిర్వహించి జాతీయ అవార్డు గెలుచుకున్నారు.
* జాతీయ ఈ గవర్నెన్స్ 2016 అవార్డును కలెక్టర్ లక్ష్మీకాంతం గెలుచుకున్నారు. పరిపాలన సంస్కరణల శాఖ ఈ వార్డును ప్రకటించింది.
* కృష్ణా జిల్లా కలెక్టరేట్‌కు ఐఎస్ఓ 9001 ధ్రువీకరణ పత్రం 2015కు దక్కింది. దీన్ని కలెక్టర్ దక్కించుకున్నారు. నాణ్యత నియంత్రణ విభాగంలో క్యూసీపీఎల్ ఈ అవార్డును ప్రకటించింది. ఉత్తమ పరిపాలనకుగాను దీన్ని అందించారు.
* స్వీప్ ఎలక్షన్స్ జాతీయ అవార్డును కలెక్టర్ దక్కించుకున్నారు. 2018లో ఉత్తమ ఎన్నికల విధానం అమలుకు గాను దీన్ని అందించారు. రెడ్‌క్రాస్ జాతీయ అవార్డు కృష్ణా జిల్లాకు దక్కింది.
* రెడ్‌క్రాస్ ఇంటర్నేషనల్ అవార్డు మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి రక్తనిధికేంద్రం కు దక్కింది. దీన్ని ఆసుపడ్రార్ఎంవో ఏబీఎస్ శ్రీనివాసరావు అందుకున్నారు. గవర్నర్ గోల్డ్‌మెడల్ దీనికి అందుకున్నారు. కృష్ణాజిల్లా అధికార యంత్రాంగం పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రసంశించారు. రెండంకెల వృద్ధి రేటు సాధించడంలో కృషి చేశారని, పర్కేపిటా ఆదాయం ఎక్కువగా ఉందని అభినందించారు. ప్రభుత్వ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.