15-July-2018-News Clips
69వ వనం-మనం కార్యక్రమం
ఊరంతా వనం.. ఆరోగ్యంగా మనం..ఏపీలో ప్రారంభమైన మహత్తర కార్యక్రమం
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే మహా యజ్ఞం ప్రారంభమైంది. కోటి మొక్కలు నాటాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ‘వనం-మనం’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 127 రోజుల పాటు సాగే ఈ యజ్ఞం విజయవంతం చేయాలని అధికారులకు పిలుపునిచ్చారు. జిల్లాల వారీగా మంత్రులు బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కృష్ణా జిల్లా నూజివీడులో ‘వనం- మనం’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ట్రిపుల్ ఐటీ కళాశాల ఆవరణలో సతీమణి భువనేశ్వరి, మనుమడు దేవాన్ష్, మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. చెట్లను కాపాడాలని నేతలు, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్రంలో 26 శాతం పచ్చదనం ఉందన్న చంద్రబాబు 2029 నాటికి 50 శాతానికి పెంచడమే లక్ష్యం అని స్పష్టం చేశారు. ఒక్కరోజే కోటి మొక్కలు నాటుతున్నామని, ఈ ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా 25కోట్ల మొక్కలు నాటనున్నట్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. మొక్కల పెంపకం, రక్షణలో ప్రజల భాగస్వామ్యం ఉండాలని చంద్రబాబు సూచించారు.ఈ కార్యక్రమంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా కాలుష్యం పెరుగుతుందని, చెట్లు పెంచడం ద్వారా వాతావరణంలో సమతుల్యత తీసుకురావాలని అధికారులకు పిలుపునిచ్చారు.
ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి: సీఎం
వనం-మనంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యేలా చూడాలని సీఎం కోరారు. అన్ని రకాల మాధ్యమాల్లో ప్రచారం కల్పించాలన్నారు. వృక్ష మిత్రలను నియమించి ప్రతి మొక్కను సంరక్షించాలని నిర్దేశించారు. 10 ఏళ్ల పాటు ఏటా 50 కోట్ల మొక్కలు నాటగలిగితే హరితాంధ్ర సాధించవచ్చన్నారు. నర్సరీల పెంపకం కోసం ప్రత్యేకంగా డీఎం స్థాయి అధికారిణి నియమించాలని ఆదేశించారు. పెద్ద సంఖ్యలో మొక్కలు నాటే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించారు. అమెరికా తరహాలో మొక్కల క్లోనింగ్ పద్దతి రావాలన్న ఆయన అటవీ ప్రాంతాల్లో నేరేడు, మారేడు, ఉసిరి వంటి ఔషధ గుణాలున్న మొక్కలతో పాటు, సీతాఫలం లాంటి పండ్ల మొక్కలు ఎక్కువగా నాటాలన్నారు. మొక్కల పెంపకం, సంరక్షణ బాధ్యత డ్వాక్రా మహిళలకు అప్పగించాలన్నారు. ఉపాధి హామీ నిధుల్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైల్వే లైన్లు, రహాదారులకు ఇరువైపులా మొక్కలు పెంచాలన్నారు. చెక్‌డ్యాంలు, రాక్‌ఫిల్ డ్యాంలు నిర్మించాలన్నారు. అటవీ ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండేలా చూస్తే అడవులు, వన్యప్రాణుల సంరక్షణతో పాటూ ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పారు.
రాష్ట్రంలోని అయిదు పక్షి సంరక్షణ కేంద్రాలను అభివృద్ధి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అటవీ ప్రాంతాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ప్రైవేటు సంస్థల సాయం తీసుకోవాలని సూచించారు. నగర వనాల అభివృద్దికి చర్యలు చేపట్టాలని నిర్ధేశించారు. నెమళ్లు, ఆయుర్వేద మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో భాగంగా పచ్చదనం పెంపు కోసం వివిధ విభాగాల్లో కృషి చేసిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. మొత్తం ఎనిమిది విభాగాల్లో 94 మందికి పురస్కారాలు అందజేశారు. పురపాలక నగర పాలక సంస్థలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, వ్యక్తిగత విభాగాల వారిగా పురస్కారాలు అందజేశారు. ఎన్జీవో విభాగంలో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అవార్డ్ అందుకున్నారు.